మిల్లింగ్ సంక్షోభంపై మద్నూర్‌లో రైస్ మిల్లర్ల ఆందోళన.. సమస్యల పరిష్కారానికి అధికారులకు వినతి
తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర పిలుపు మేరకు చేపట్టిన నిరవధిక మిల్లుల బంద్‌లో భాగంగా బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మద్నూర్ డిప్యుటీ తహసీల్దార్ ఎం.డి. ఖాలీద్‌కు వినతి పత్రం అందజేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) డెలివరీల్లో ఎదురవుతున్న క్షేత్రస్థాయి సమస్యలు, ఆర్థిక నష్టాలు, ఓపెన్ స్టోరేజ్ కొరత, ఫిజికల్ వెరిఫికేషన్ తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు.
ప్రస్తుత నిల్వల్లో 15 నుంచి 20 శాతం వరకు షార్ట్‌ఫాల్ ఏర్పడిన సందర్భాల్లో వెంటనే కాస్ట్‌షీట్ ప్రకారం డబ్బులు చెల్లించాలని మిల్లర్లపై ఒత్తిడి చేయకుండా, ప్రభుత్వం నిర్దేశించిన గడువులో CMR డెలివరీలు పూర్తి చేసేందుకు తగిన అవకాశం కల్పించాలని అసోసియేషన్ కోరింది.
రబీ 2025-26 సీజన్‌లో వచ్చిన బాయిల్డ్ రకం ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లుల్లోనే దిగుమతి చేసుకున్నామని మిల్లర్లు తెలిపారు. ప్రతి గింజను బాయిల్డ్ బియ్యంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వానికి ఆ బియ్యం అవసరం లేకపోతే టెండర్ల ద్వారా లేదా ఇతర మార్గాల్లో ధాన్యాన్ని మిల్లుల నుంచి వేగంగా తరలించే చర్యలు చేపట్టాలని కోరారు.
రైతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన నాన్‌ఫ్యాక్ ధాన్యం మిల్లులకు చేరడం వల్ల FCI, సివిల్ సప్లయ్స్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా బియ్యం తయారు చేసేందుకు సార్టెక్స్ ప్రక్రియ అవసరమవుతోందని మిల్లర్లు పేర్కొన్నారు. దీనివల్ల డిస్‌కలర్, డ్యామేజ్ బియ్యం అధికంగా వస్తోందని తెలిపారు.
వీటిని లిక్కర్, ఇథనాల్ ఫ్యాక్టరీలకు తక్కువ ధరలకు విక్రయించాల్సి రావడంతో క్వింటాల్‌కు రూ.750 నుంచి రూ.1,000 వరకు నష్టం వస్తోందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అలాగే క్వింటాల్‌కు 67 శాతం రికవరీ ఇవ్వడం క్షేత్రస్థాయిలో కష్టంగా మారిందని పేర్కొన్నారు.
KMS 2025-26 ఖరీఫ్ ధాన్యాన్ని మిల్లుల్లో దిగుమతి చేసుకున్న తర్వాత సుమారు తొమ్మిది నెలల వరకు CMR తీసుకోకపోవడం వల్ల ధాన్యంలో సహజ తేమ తగ్గి బరువు తగ్గిందని మిల్లర్లు తెలిపారు. గతంలో 41 కిలోలుగా ఉన్న బస్తా ప్రస్తుతం సుమారు 37 కిలోలకు తగ్గిందని పేర్కొన్నారు.
రబీ సీజన్‌లో అధికారుల సూచనలు, ఒత్తిడి మేరకు రైతులకు ఇబ్బందులు కలగకుండా మిల్లర్లు బహిరంగ ప్రదేశాల్లో కూడా ధాన్యాన్ని నిల్వ చేశారని తెలిపారు. ప్రస్తుతం బాయిల్డ్ బియ్యానికి తగిన టార్గెట్ లేకపోవడంతో పాటు గోదాముల్లో స్థలం కొరత కారణంగా FCI బియ్యం స్వీకరణ నిలిచిపోయిందని పేర్కొన్నారు.
దీంతో ఆరుబయట నిల్వ చేసిన ధాన్యం వర్షాలు, ఎండలకు దెబ్బతిని భారీ నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వెంటనే FCI అధికారులతో చర్చించి బాయిల్డ్ బియ్యం స్వీకరణకు, గోదాముల్లో అవసరమైన స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
సహజ తరుగు, నాణ్యతా సమస్యలు, గోదాముల కొరత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆకస్మికంగా నిర్వహిస్తున్న ఫిజికల్ వెరిఫికేషన్లతో మిల్లర్లలో ఆందోళన నెలకొందని అసోసియేషన్ పేర్కొంది. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఫిజికల్ వెరిఫికేషన్లు, కఠిన చట్టపరమైన చర్యలను నిలిపివేయాలని కోరింది.
డిఫాల్ట్ మిల్లులపై విధించిన 25 శాతం నుంచి 12 శాతం వరకు ఫైన్‌ను మాఫీ చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. రైస్ మిల్లింగ్ పరిశ్రమతో పాటు దానిపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బాన్సువాడ డివిజన్ రైస్ మిల్ అసోసియేషన్


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి