కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం
మధిర మండలంలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న యువతిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
మధిర మండలం తొండలగోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని తొర్లపాడు గ్రామానికి చెందిన వగ్గలా శివరామ్ గోపి (ముదిరాజ్) మరియు మధిర మండలం మర్లపాడు గ్రామానికి చెందిన రేగల్ల కావ్య (రెడ్డి) గత నాలుగు సంవత్సరాలుగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెద్దలు తమ ప్రేమ వివాహానికి అంగీకరించరని భావించిన ఈ ప్రేమికులు 07-03-2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో తమ ఇష్టప్రకారం వివాహం చేసుకున్నారు.
వివాహం అనంతరం వారు మధిర పట్టణ పోలీసు స్టేషన్‌లో హాజరై విషయం తెలియజేశారు. ఈ సందర్భంగా మధిర పట్టణ వలయాధికారి కిషోర్ కుమార్ అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి, ఇద్దరూ పెద్దవాళ్లు కావడంతో చట్ట ప్రకారం వారి స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించకూడదని సూచించినట్లు సమాచారం. అలాగే అమ్మాయికి ఏమైనా అపాయం జరిగితే అబ్బాయి బాధ్యత వహిస్తాడని రాతపూర్వకంగా పత్రం తీసుకుని ఇద్దరినీ అబ్బాయి ఇంటికి పంపించారు.
అయితే 09-03-2026న భార్యాభర్తలు ఇద్దరూ ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం ఆలయానికి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వచ్చి యువతి రేగల్ల కావ్యను కారులో బలవంతంగా ఎక్కించుకొని అపహరించి తీసుకెళ్లినట్లు సమాచారం.
కులాంతర ప్రేమ వివాహం కారణంగానే అమ్మాయి తరుపు బంధువులే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ప్రేమ వివాహం చేసుకున్న యువతిని అపహరించిన ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనం నుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి