జుక్కల్ బస్సు ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తక్షణ స్పందన.. బాధితులకు అండగా చర్యలు
జుక్కల్ ఎక్స్‌రోడ్ వద్ద ఘోర బస్సు ప్రమాదం.. డ్రైవర్ మృతి
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని జుక్కల్ ఎక్స్‌రోడ్ సమీపంలో కెమెరాస్ కల్లాలి గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తున్న TG35Z0030 నంబర్ గల బస్సు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ప్రమాదంలో డ్రైవర్ మృతి.. 13 మందికి గాయాలు
బస్సు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే బిచ్కుంద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది.
ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి
జుక్కల్ చౌరస్తా వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందడం పట్ల ఆయన సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఆరోగ్య, రవాణా శాఖ మంత్రులతో ఎమ్మెల్యే చర్చ
ప్రమాద ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆరోగ్య, రవాణా శాఖ మంత్రులతో మాట్లాడినట్లు తెలిపారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం, ఇతర సహాయక చర్యలు అందేలా అధికారులతో సమన్వయం చేస్తున్నారు.
ఘటనాస్థలికి హుటాహుటిన ఎమ్మెల్యే
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కామారెడ్డి నుంచి హుటాహుటిన జుక్కల్ వైపు బయలుదేరారు. ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద పరిస్థితిని పరిశీలించి, బాధితులకు అవసరమైన సహాయం అందేలా అధికారులకు సూచనలు చేశారు.
తెలంగాణ స్రవంతి
జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి