లండన్ నుంచి నారాయణఖేడ్‌కు తిరిగొచ్చిన విద్యావేత్త.. ఈ-తక్షిలతో విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త బాట
నారాయణఖేడ్ పరిధిలోని జూజల్‌పూర్ గ్రామ సమీపంలో ఉన్న ఈ-తక్షిల విద్యాలయం కరస్పాండెంట్, గురువు శరత్‌కుమార్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. విద్యాలయంలో ఉదయం, సాయంత్రం శ్రీ సూపర్ మార్కెట్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శరత్‌కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వేద మంత్రాలు, భక్తిగీతాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. అనంతరం హర్షధ్వానాల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
శరత్‌కుమార్ ఎంసీఏ పూర్తి చేసి లండన్‌లో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేస్తూ ఆధునిక సాంకేతికత, విద్యా విధానాలను దగ్గరగా పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అభివృద్ధికి విద్యే పునాది అనే ఆలోచనతో తన ప్రాంతమైన నారాయణఖేడ్ కూడా విద్యతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విద్యా రంగంలో సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
తన ప్రాంతంలోని విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో లండన్ నుంచి నారాయణఖేడ్‌కు తిరిగి వచ్చారు. ప్రాంతంలోని మేధావులు, విద్యావేత్తలు, నాయకుల సలహాలు తీసుకుని ఈ-తక్షిల విద్యాలయానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ఈ-తక్షిల విద్యాలయంలో పాఠ్యపుస్తక విద్యకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, దేశభక్తి పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భక్తిగీతాలు, నృత్యాలు, రైతుల సమస్యలు, భారతీయ సంస్కృతి, కాలుష్య నివారణ, కవిసమ్మేళనాలు, భరతనాట్యం, కూచిపూడి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజంలోని పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎలా చేరాలి, దేశాభివృద్ధిలో యువత పాత్ర ఏమిటి వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
శరత్‌కుమార్ అందిస్తున్న విద్యా సేవలను విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు. నిరుపేద కుటుంబాల పిల్లలకు విద్యా అవకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు.
గురువు విద్యార్థి జీవితానికి మార్గదర్శిగా నిలుస్తారని పలువురు పేర్కొన్నారు. విద్యతో పాటు విలువలు, సామాజిక బాధ్యతను నేర్పించే గురువుల సేవలను విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తుచేసుకున్నారు. శరత్‌కుమార్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ఈ-తక్షిల విద్యాలయ లక్ష్య సాధనలో తోటి ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని శరత్‌కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయ బృందం చేస్తున్న కృషిని అభినందించారు.
రానున్న రోజుల్లో విద్య, సాంకేతికత, సంస్కారం, సామాజిక బాధ్యతలకు సమ ప్రాధాన్యం ఇచ్చే ఆదర్శ విద్యాసంస్థగా ఈ-తక్షిలను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని శరత్‌కుమార్ తెలిపారు.
ఈ జన్మదిన వేడుకల్లో తోటి గురువులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మిత్రులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
.jpg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి