కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌లో భారీ మోసం బట్టబయలు.. నకిలీ ధృవపత్రాల ముఠాను ఛేదించిన కామారెడ్డి పోలీసులు

కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ నకిలీ ధృవపత్రాల మోసాన్ని ఛేదించిన పోలీసులు

ముగ్గురు నిందితుల అరెస్ట్.. కంప్యూటర్ పరికరాలు, నకిలీ ముద్రలు, డిజిటల్ రికార్డులు స్వాధీనం


జుక్కల్, జూలై 28 | తెలంగాణ స్రవంతి ప్రతినిధి : కామారెడ్డి జిల్లాలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద నకిలీ ధృవీకరణ పత్రాలతో అక్రమంగా దరఖాస్తులు సమర్పిస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ముగ్గురు నిందితుల అరెస్ట్

ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి కంప్యూటర్ పరికరాలు, నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఆర్‌ఎంఓ పేరుతో నకిలీ సంతకాలు

ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఆర్‌ఎంఓగా పనిచేస్తున్న డా. చందారి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఆయన పేరుతో నకిలీ సంతకాలు, అధికారిక రబ్బరు ముద్రలను దుర్వినియోగం చేసి వయస్సు, మొదటి వివాహ ధృవీకరణ పత్రాలను తయారు చేసి సంక్షేమ పథకాల కోసం వినియోగించినట్లు దర్యాప్తులో గుర్తించారు.

ప్రత్యేక దర్యాప్తు బృందాల విచారణ

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టాయి. ఈ క్రమంలో భిక్కనూర్‌లోని లహరి జిరాక్స్ అండ్ ఆన్‌లైన్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

52 దరఖాస్తులపై విచారణ

విచారణలో ప్రధాన నిందితులు తోడెంగల రాజా నరేందర్, తోడెంగల రాజలింగం తమ ఆన్‌లైన్ సేవా కేంద్రం ద్వారా ఇప్పటివరకు సుమారు 52 దరఖాస్తులను సమర్పించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ దరఖాస్తులన్నింటిపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

దరఖాస్తుదారుల నుంచి వేల రూపాయల వసూళ్లు

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం వచ్చిన దరఖాస్తుదారుల నుంచి అవసరమైన పత్రాలు సేకరించి ఒక్కో దరఖాస్తుకు రూ.4,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగితో కుమ్మక్కు

జిల్లా ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న బోయిని ప్రసాద్‌తో కుమ్మక్కై ప్రభుత్వ వైద్యాధికారుల పేర్లతో నకిలీ సంతకాలు, నకిలీ రబ్బరు ముద్రలు ఉపయోగించి ధృవీకరణ పత్రాలు తయారు చేసి వాటిని ఆన్‌లైన్‌లో సమర్పించినట్లు పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.


TS MEDIA TELUGU

తెలంగాణ స్రవంతి

జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం