పచ్చదనంపై గొడ్డలి..! అంత్వార్‌లో 400కు పైగా చెట్లు ధ్వంసం – బాధ్యులపై చర్యలు కోరుతున్న గ్రామస్తులు
పచ్చదనంపై గొడ్డలి..! అంత్వార్‌లో పల్లె ప్రకృతి వనం ధ్వంసం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ నాయకుల డిమాండ్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని అంత్వార్ గ్రామంలో అభివృద్ధి చేసిన పల్లె ప్రకృతి వనం ధ్వంసం కావడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణం అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని గ్రామ నాయకుడు సాల్మన్ ఆరోపించారు.
400కు పైగా మొక్కలు ధ్వంసం
సుమారు 12 గుంటల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ పల్లె ప్రకృతి వనంలో 400కు పైగా పండ్ల మొక్కలు, కొబ్బరి చెట్లు, నిమ్మ, నేరేడు, పూల మొక్కలు తదితర మొక్కలను నాటి పచ్చని వాతావరణాన్ని ఏర్పాటుచేశామని తెలిపారు. అయితే వారం రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను ధ్వంసం చేయడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటనపై ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గ్రామ నాయకులు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు.
ప్రకృతి వనాన్ని పునరుద్ధరించాలి
ధ్వంసమైన పల్లె ప్రకృతి వనాన్ని వెంటనే పునరుద్ధరించి, గ్రామ ప్రజలకు మళ్లీ పచ్చని వాతావరణాన్ని అందించాలని కోరారు. గ్రామానికి ఆక్సిజన్ అందించే చెట్లను నరికివేయడం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.
పచ్చదనాన్ని కాపాడాలి
"పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు", "ఒక చెట్టును నరికేయడం అంటే ఒక ప్రాణవాయు నిల్వను కోల్పోవడమే" అని గ్రామ నాయకులు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమానికి తాము అండగా ఉంటామని, అయితే పచ్చదనాన్ని నాశనం చేసే చర్యలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
తెలంగాణ స్రవంతి
జనంనుంచి జనంలోకి
www.telanganasravanti.in

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి