చెరువుల భూములు కాపాడాలి... కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం, బీఎస్పీ ధర్నా
🚨 చెరువులు, కుంటల భూములపై కబ్జాల ఆరోపణలు... వెంటనే సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలి: సీపీఎం, బీఎస్పీ
సంగారెడ్డి జిల్లా | నారాయణఖేడ్ | ఖాజీపూర్ | సీపీఎం | బీఎస్పీ | చెరువు భూములు | తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ | తెలంగాణ స్రవంతి ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని ఖాజీపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఎం, బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ ఉమాహారతికి వినతిపత్రం సమర్పించారు.
చెరువుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయన్న ఆరోపణ
ఈ సందర్భంగా సీపీఎం ఏరియా కార్యదర్శి రమేష్, బీఎస్పీ ఇన్‌చార్జి అనుముల తుకారాం మాట్లాడుతూ ఖాజీపూర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 131లోని బొబ్బిలి చెరువు, సర్వే నంబర్ 83లోని గంధం కుంట, సర్వే నంబర్ 26లోని పోశమ్మ కుంట, సర్వే నంబర్ 177లోని సౌటకుంట, సర్వే నంబర్ 170/1లోని పుల్చెరువు భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపించారు.
ముఖ్యంగా బొబ్బిలి చెరువు పరిసరాల్లో సుమారు 10 ఎకరాల వరకు ఆక్రమణ జరిగిందని, మరికొన్ని చెరువులు, కుంటల భూముల్లో కూడా సాగు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం వరి సాగు చేయడమే కాకుండా మట్టి, మొరం పోసి మరింతగా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
సర్వే నిర్వహించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
ఈ అంశాన్ని గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి సర్వే నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే చెరువులు, కుంటల ప్రభుత్వ భూములను సర్వే చేసి అక్రమ ఆక్రమణలను తొలగించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చర్యలు లేకుంటే ఉద్యమం
ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు, దీక్షలు చేపడతామని సీపీఎం, బీఎస్పీ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భాస్కర్, రామ్‌లాల్, సంతోష్, రమేష్, బీఎస్పీ నాయకులు ఖాసయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ స్రవంతి ప్రతినిధి
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి