ఆంధ్రా ఉచిత ఇసుకను తెలంగాణలో అమ్ముతూ కోట్ల దందా… ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం
ఆంధ్రా ఉచిత ఇసుకను తెలంగాణలో అమ్ముతూ కోట్ల దందా… ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం
ఆంధ్రప్రదేశ్ ఉచిత ఇసుకను దారి మళ్లించి తెలంగాణలో అక్రమ వ్యాపారం
తెలంగాణ స్రవంతి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందిస్తున్న ఇసుకను అక్రమంగా దారి మళ్లించి తెలంగాణలో భారీ స్థాయిలో అమ్మకాల దందా నిర్వహిస్తున్న ఇసుక మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప గ్రామానికి చెందిన పాటిబండ్ల పార్ధసారది చౌదరి అలియాస్ పార్ధసారది తనకు చెందిన మూడు లారీల ద్వారా కొవ్వూరు గోదావరి నది ఇసుక ర్యాంప్ నుంచి ఇసుకను తరలించి ఖమ్మం జిల్లా సరిహద్దు మండలాలైన సత్తుపల్లి, వేంసూర్ ప్రాంతాల్లో అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం
తెలంగాణ రాష్ట్ర మైనింగ్ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ మధ్యవర్తులను పెట్టుకుని ఆర్గనైజ్డ్ పద్ధతిలో ఇసుక దందా కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయాన్ని అక్రమ రవాణా ద్వారా మాఫియా దోచుకుంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదు
పాటిబండ్ల పార్ధసారది చౌదరిపై గతంలో పలుమార్లు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఎనిమిది కేసులు నమోదు చేసినప్పటికీ నిందితుడు తన పద్ధతి మార్చుకోకుండా అక్రమ ఇసుక రవాణాను కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు.
వేంసూర్ ఎస్ఐ కవిత అప్రమత్తతతో బయటపడిన అక్రమ దందా
తేదీ 30-03-2026న AP 16 TJ 4888 నంబర్ లారీలో కొవ్వూరు గోదావరి ర్యాంప్ నుంచి ఇసుకను లోడ్ చేసి కల్లూరుగూడెం గ్రామానికి తరలిస్తుండగా వేంసూర్ ఎస్ఐ కవిత తన సిబ్బందితో కలిసి లారీని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో లారీ డ్రైవర్ ఈదర విష్ణు వర్ధన్‌తో పాటు మధ్యవర్తి ఆముదాల మధు ప్రమేయం కూడా బయటపడింది.
చీటింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసులు నమోదు
ఈ ఘటనపై పోలీసులు చీటింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి ప్రధాన నిందితుడు పార్ధసారది చౌదరి పరారీలో ఉండగా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాలతో నిందితుల అరెస్ట్
కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పార్ధసారది చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు ఆముదాల మధును కల్లూరుగూడెం వద్ద అరెస్టు చేశారు.
ఇసుక మాఫియాపై పోలీసుల కఠిన వైఖరి
తెలంగాణలో అక్రమ ఇసుక దందాను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే ఇసుక మాఫియాపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🔗 telanganasravanti.in

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి