ఐపీఎస్ అధికారిణినే వేధించిన పోకిరీలు… దిల్‌సుఖ్‌నగర్‌లో అర్ధరాత్రి షాకింగ్ ఘటన
గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై దృష్టి పెట్టిన మల్కాజ్‌గిరి కమిషనర్
తెలంగాణ స్రవంతి ప్రతినిధి: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐపీఎస్ అధికారిణి సుమతి నగర భద్రతా పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించారు. రాత్రివేళల్లో మహిళల భద్రత ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆమె సాధారణ మహిళలా వేషం మార్చుకుని దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌కు వెళ్లారు.
“నీ రేటు ఎంత?” అంటూ అసభ్య ప్రవర్తన
అర్ధరాత్రి సమయంలో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బస్టాండ్‌లో నిల్చున్న ఆమెను కొందరు పోకిరీలు చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. “వస్తావా… నీ రేటు ఎంత?” అంటూ వెకిలి ప్రశ్నలు అడుగుతూ వేధింపులకు దిగినట్లు తెలిసింది.
మూడు గంటలపాటు పోలీసుల జాడ లేదు
దాదాపు మూడు గంటలపాటు అక్కడికి ఒక్క పెట్రోలింగ్ వాహనం గానీ, పోలీసులు గానీ రాకపోవడం పరిస్థితి తీవ్రతను బయటపెట్టింది. అక్కడ ఉన్న వారిలో చాలా మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు మద్యం మరియు గంజాయి మత్తులో ఉన్నట్లు కమిషనర్ సుమతి గుర్తించినట్లు సమాచారం.
బీట్ కానిస్టేబుల్ రాకతో బయటపడిన అసలు విషయం
మూడున్నర గంటల తర్వాత అక్కడికి ఒక బీట్ కానిస్టేబుల్ రావడంతో పరిస్థితి మారింది. అనంతరం ఎస్సై అక్కడికి చేరుకుని సెల్యూట్ చేయడంతో ఆమె మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి అని తెలిసి అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
40 మంది పోకిరీల అదుపులోకి
ఈ ఘటన అనంతరం పోలీసులు దాదాపు 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం, గంజాయి అలవాట్లు, మహిళలపై అసభ్య ప్రవర్తన, రోడ్లపై వేధింపుల విషయంలో ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
మహిళల భద్రతపై మరోసారి చర్చ
ఈ ఘటనతో నగరంలో మహిళల భద్రత, రాత్రివేళల్లో పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్రదేశాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🔗 telanganasravanti.in

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి