సత్యనారాయణపురంలో చౌడాలమ్మ జాతర వైభవం… మూడు తరాల భక్తి సంప్రదాయానికి మళ్లీ పునర్జీవం


మూడు తరాలుగా పూజలందుకుంటున్న చౌడాలమ్మ తల్లి జాతర… సత్యనారాయణపురంలో భక్తి పారవశ్యం


గిరిజన ఆరాధ్య దైవంగా చౌడాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

తెలంగాణ స్రవంతి ప్రతినిధి: చండ్రుగొండ మండలంలోని సత్యనారాయణపురంలో గిరిజన ఆరాధ్య దైవంగా భావించే చౌడాలమ్మ తల్లి జాతర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. గ్రామ ప్రజలు, యూత్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.


సమ్మక్క – సారలమ్మ జాతర తరహాలో ఏర్పాట్లు

సత్యనారాయణపురం – వెంకటాపురం గ్రామాల మధ్య భారీ టెంట్లు, చలవ పందిళ్లు, తాటాకుల ఇండ్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమ్మక్క – సారలమ్మ జాతర తరహాలో సుమారు 15 మందికి పైగా పూజారుల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ పూజలు

గత మూడు తరాలుగా పూజలు అందుకుంటున్న చౌడాలమ్మ తల్లికి కరోనా ప్రభావంతో గత ఆరు సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలు జరగలేదు. గ్రామంలో ప్రజల ఆరోగ్య సమస్యలు, పాడిపంటల ఇబ్బందులు పెరగడంతో గ్రామస్థులు ఏకమై మళ్లీ జాతర నిర్వహించాలని నిర్ణయించారు.


నాగులమ్మ పడగలతో ప్రత్యేక వేడుకలు

బ్రాహ్మణపల్లి నుంచి నాగులమ్మ పడగలను మేళతాళాల నడుమ సత్యనారాయణపురానికి తీసుకువచ్చి అమ్మవారి సన్నిధికి చేర్చారు. అమ్మవారి పూనకాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.


భక్తులకు అన్నదాన కార్యక్రమాలు

జాతరకు తరలివచ్చిన భక్తులందరూ అన్నదానం స్వీకరించాలని, అమ్మవారికి మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. గ్రామంలో ఇప్పటికే పండగ వాతావరణం నెలకొంది.


తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🔗 telanganasravanti.in

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం