మధిరలో రైతు వారోత్సవాలు… ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమం

 


మధిరలో రైతు వారోత్సవాలు… ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమం

05-05-26 | వ్యవసాయం

ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగు పెంపు… ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు మార్గదర్శనం

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మధిరలో రైతు వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగు పెంపు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బండారు నరసింహారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

రైతులకు సంక్షేమ పథకాలపై అవగాహన

ముఖ్య అతిథి బండారు నరసింహారావు గారు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మొక్కజొన్న పంట అనంతరం మిగిలిన అవశేషాలను కాల్చవద్దని సూచించారు. ఇలా చేస్తే భూసారానికి నష్టం కలుగడంతో పాటు భూమిలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, వానపాములు నశిస్తాయని తెలిపారు. ఇది ఆస్తి నష్టమే కాకుండా ప్రాణ నష్టానికి కూడా దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఆయిల్ పామ్ సాగుపై అధికారుల సూచనలు

మధిర డివిజన్ వ్యవసాయ సంచాలకులు విజయ్ చంద్ర గారు మాట్లాడుతూ రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు పండించడంపై దృష్టి పెట్టాలని, బిందు సేద్యం పరికరాలను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు.

పంట మార్పిడి, ఆధునిక పద్ధతులపై దృష్టి

వ్యవసాయ పరిశోధన స్థానం సైంటిస్టు నాగస్వాతి గారు రైతులు పంట మార్పిడి చేయడం, అపరాల సాగు చేపట్టడం వంటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు. ఉద్యాన అధికారులు ఉద్యాన శాఖ అమలు చేస్తున్న పథకాలను రైతులకు వివరించారు. అలాగే కూరగాయల విస్తీర్ణం పెంపు, ఆయిల్ పామ్ తోటల అభివృద్ధి, పండ్ల తోటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.

పలువురు ప్రముఖుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు, వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, కర్నాటి రామారావు గారు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, టీజీ ఆయిల్ ఫేడ్ ఫీల్డ్ ఆఫీసర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఆయిల్ పామ్ రైతులు, కూరగాయల రైతులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

కామెంట్‌లు