భట్టుపల్లి గ్రామ పంచాయతీలో నిధుల వినియోగంపై వివాదం… కార్యదర్శిపై గ్రామస్థుల ఫిర్యాదు
భట్టుపల్లి గ్రామ పంచాయతీలో అవినీతి ఆరోపణలు…
👉 కార్యదర్శిపై గ్రామస్థుల ఫిర్యాదు
👉 రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణలు
👉 నిధుల వినియోగంపై అనుమానాలు వెల్లువ
కాగాజ్ నగర్, ఏప్రిల్ 07 (తెలంగాణ స్రవంతి)
కాగాజ్ నగర్ మండలం భట్టుపల్లి గ్రామ పంచాయతీలో నిధుల వినియోగంపై వివాదం నెలకొంది. గ్రామ కార్యదర్శి మహేష్‌పై నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ గ్రామస్థులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.
గ్రామ పంచాయతీ ఖర్చులకు సంబంధించిన రికార్డులు కోరినప్పుడు కార్యదర్శి సరైన సమాధానం ఇవ్వలేదని, బాధ్యతారాహిత్యంగా స్పందించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన క్యాష్ బుక్ సక్రమంగా నిర్వహించలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే పాలకవర్గ సభ్యుల అనుమతి లేకుండా నిధుల వినియోగానికి ప్రయత్నించారని, CSF నిధుల కింద సుమారు రూ.2,18,000/- మొత్తాన్ని విత్‌డ్రా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కొత్త పాలకవర్గం ఆమోదం లేకుండానే పాత బకాయిల పేరుతో బిల్లులు క్లియర్ చేయాలని యత్నించారని కూడా ఫిర్యాదులో తెలిపారు.
గ్రామస్థుల అభిప్రాయం ప్రకారం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవడం వల్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించబడుతున్నాయా అనే అంశంపై స్పష్టత కావాలని వారు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
https://telanganasravanti.in

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి