నాణ్యతే రైతుకు న్యాయం… ప్రమాణాలు పాటిస్తేనే మద్దతు ధర: ఎమ్మెల్యే మందుల సామెల్
👉 ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
👉 రైతులకు పూర్తి ధర హామీ
👉 అక్రమాలపై కఠిన చర్యల హెచ్చరిక
సూర్యాపేట జిల్లా నాగారం, ఏప్రిల్ 09
తెలంగాణ స్రవంతి ప్రతినిధి
రైతు కష్టానికి సరైన విలువ రావాలంటే నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే మందుల సామెల్ సూచించారు. గురువారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి, ఈటూర్ గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం అండగా ఉంటుంది… కానీ నాణ్యత ఉండాలి” అని స్పష్టం చేశారు. రైతులు సరైన ప్రమాణాలు పాటిస్తేనే మద్దతు ధర సకాలంలో పొందగలరని తెలిపారు. వ్యవసాయంలో నాణ్యత పెంపు ద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహణలో పారదర్శకత, సమయపాలన ఎంతో కీలకమని ఎమ్మెల్యే అన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా కేంద్రాల్లో తగిన వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. తూకం, నిల్వ, చెల్లింపుల వ్యవస్థల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.
“రైతు చెమట చిందించి పండించిన పంటకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత… ఆ బాధ్యతను ఎవరూ తేలికగా తీసుకోకూడదు” అని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా తెలిపారు.
రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా లోపాలు గమనించిన వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు. వ్యవసాయ రంగం బలోపేతం కావాలంటే ప్రభుత్వం, రైతులు, అధికారులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎల్సోజ్ స్రవంతి, నరేష్, సీఈఓ విజయకృష్ణ రెడ్డి, తోడుసు లింగయ్య, పానుగంటి నరసింహారెడ్డి, సర్పంచులు ఎర్ర సావిత్రి, యాదగిరి, వంగూరి దామోదర్, ఉపసర్పంచ్ బాను ప్రకాష్, రామ్ రెడ్డి, నాతి వెంకన్, రవి, కర్ణాకర్, లక్ష్మీకాంత్, యాదగిరి, సర్వన్, ఉమ తదితరులు పాల్గొన్నారు.
“నాణ్యతే రైతు బలం… న్యాయమైన ధరే రైతు గౌరవం” అనే సందేశంతో ఈ కార్యక్రమం సాగింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి