విద్యుత్ కార్మికుల సమ్మె తీవ్రతరం… సమస్యల పరిష్కారం వరకు వెనక్కి తగ్గం
👉 మధిరలో దీక్షా శిబిరంతో ఆందోళన ఉధృతి
👉 ఆర్టిజన్స్, అన్‌మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికుల గళమెత్తింపు
👉 ట్రేడ్ యూనియన్ల సంపూర్ణ మద్దతు
మధిర, ఏప్రిల్ 08
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్స్, అన్‌మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ పిలుపు మేరకు మధిర విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం సమీపంలో దీక్షా శిబిరం ఏర్పాటు చేసి కార్మికులు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు.
మధిర డివిజన్ పరిధిలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలంటూ గళమెత్తుతున్నారు. “పనులు మాత్రం పూర్తి స్థాయిలో చేయించుకుంటున్నారు… కానీ హక్కులు మాత్రం ఇవ్వడం లేదు” అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మధిర డివిజన్ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ సిహెచ్. రామకృష్ణ మాట్లాడుతూ, కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ సమ్మెను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమ్మెకు విద్యుత్ శాఖలోని ప్రధాన ట్రేడ్ యూనియన్లు మద్దతు తెలపడం గమనార్హం. 327 యూనియన్, 1104 యూనియన్, టిఆర్వికేఎస్ యూనియన్ నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు సమ్మె స్థలానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. కార్మికుల పోరాటానికి పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని ప్రకటించారు.
“విద్యుత్ రంగం నిలబడాలంటే కార్మికుల సంక్షేమం ముందుండాలి” అంటూ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. కార్మికుల సేవలు లేకుండా విద్యుత్ వ్యవస్థ సజావుగా నడవదని, అయినప్పటికీ వారి సమస్యలు పట్టించుకోకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమ్మెలో ఆర్టిజన్స్, అన్‌మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి