🟥 50 ఏళ్ల రామాలయ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వివాదం – చర్యల కోసం గ్రామస్తుల ఆగ్రహం

 


🟥 రామాలయ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలు – చర్యల కోసం గ్రామస్తుల డిమాండ్

🟨 50 ఏళ్ల ఆలయ భూమిపై వివాదం… బెదిరింపుల ఆరోపణలు

🟦 పోలీసులకు ఫిర్యాదు – భూమిని తిరిగి ఆలయానికి అప్పగించాలంటూ విజ్ఞప్తి


📍 సూర్యాపేట, తెలంగాణ స్రవంతి ప్రతినిధి


సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటికుంట గ్రామంలో రామాలయానికి చెందిన భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సుమారు 50 ఏళ్ల క్రితం గ్రామంలోని రామాలయానికి కేటాయించిన భూమిని అదే గ్రామానికి చెందిన మామిడి సైదులు తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని గ్రామస్థులు పేర్కొన్నారు.


ఆదివారం రామాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో గ్రామానికి చెందిన గట్టు రమేష్ మాట్లాడుతూ… ఆలయానికి కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని సైదులు గతంలో స్వాధీనం చేసుకొని ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాడన్నారు. అనంతరం ఆలయానికి చెందిన మిగిలిన భూమిని కూడా తన ఇంటి స్థలంతో కలిపి రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆ ఆస్తిపై బ్యాంకులో రుణం తీసుకున్నాడని ఆరోపించారు.


ఈ విషయం బయటపడిన తరువాత గ్రామ పెద్దల సమక్షంలో సైదులను ప్రశ్నించగా… బ్యాంకు రుణం క్లియర్ చేసిన వెంటనే భూమిని తిరిగి రామాలయానికి అప్పగిస్తానని అంగీకరించినట్లు తెలిపారు. అయితే ఆ ఒప్పందం జరిగి దాదాపు 30 నెలలు గడిచినా ఇప్పటివరకు రుణం క్లియర్ చేయకపోవడమే కాకుండా, భూమి విషయమై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఆరోపించారు.


ఈ ఘటనపై ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి రామాలయ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఆలయానికి చెందిన భూమిని తిరిగి దేవాలయానికి అప్పగించేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.


గ్రామ ఆస్తుల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


ఈ కార్యక్రమంలో పెద్ద మేతరి మామిడి జానయ్య, చెరుకుపల్లి అశోక్, మహేష్, చెరుకుపల్లి చంద్రయ్య, గట్టు అచ్చయ్య, మామిడి ఈదమ్మ తదితరులు పాల్గొన్నారు.


━━━━━━━━━━━━━━━━━━━━━━━  

తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి 🌐 https://telanganasravanti.in

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం