తెలంగాణ స్రవంతి కథనానికి స్పందన... మనూర్–జహీరాబాద్ రహదారిపై కంకర చిప్స్ వేసిన అధికారులు
తెలంగాణ స్రవంతి కథనానికి స్పందన... మనూర్–జహీరాబాద్ రహదారిపై కంకర చిప్స్ వేసిన అధికారులు
► ప్రమాదకర రహదారిపై తాత్కాలిక చర్యలు • శాశ్వత పరిష్కారం కోరుతున్న స్థానికులు
నారాయణఖేడ్, జూలై 29 (తెలంగాణ స్రవంతి సంగారెడ్డి ప్రతినిధి):రాములు
సంగారెడ్డి జిల్లా మనూర్–జహీరాబాద్ ప్రధాన రహదారిపై కాసినాథ్ మందిర్ మూలమలుపు వద్ద ఏర్పడిన భారీ గుంతలు, పిప్రి–చెడవ్ ఎక్కే గడ్డ వద్ద పేరుకుపోయిన బురద కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తెలంగాణ స్రవంతి ప్రచురించిన ప్రత్యేక కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాల్లో తాత్కాలికంగా కంకర చిప్స్ వేసి వాహనాల రాకపోకలకు కొంతమేర సౌలభ్యం కల్పించే చర్యలు చేపట్టారు.
► కథనం ప్రచురితమైన వెంటనే స్పందించిన అధికారులు
కాసినాథ్ మందిర్ మూలమలుపు వద్ద భారీ గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొంది. అలాగే పిప్రి–చెడవ్ ఎక్కే గడ్డ వద్ద బురద పేరుకుపోవడంతో వాహనాలు జారిపడే ప్రమాదం ఎక్కువైంది. ఈ సమస్యలను "ప్రాణాలు పోతేనే స్పందనా..?" అనే శీర్షికతో తెలంగాణ స్రవంతి వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారిపై కంకర చిప్స్ వేయించారు.
► తాత్కాలిక ఊరట... శాశ్వత పరిష్కారం ఎప్పుడు?
ప్రస్తుతం కంకర చిప్స్ వేయడంతో వాహనదారులకు కొంతవరకు ఊరట లభించినప్పటికీ, ఇది తాత్కాలిక చర్య మాత్రమేనని స్థానికులు పేర్కొంటున్నారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో గుంతలను పూర్తిగా పూడ్చి, రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
► డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి
వర్షపు నీరు రహదారిపై నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నాణ్యమైన రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా అధికారులు తక్షణమే శాశ్వత చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
► తెలంగాణ స్రవంతి కథనానికి ప్రజల ప్రశంసలు
ప్రజల సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన తెలంగాణ స్రవంతి కథనానికి అధికారులు స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మీడియా వేదికగా తెలంగాణ స్రవంతి చేస్తున్న కృషిని అభినందిస్తూ, ఇకపై కూడా ఇలాంటి సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి