కాసినాథ్ మందిర్ మూలమలుపు వద్ద మృత్యు గుంతలు.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్
🚨 ప్రాణాలు పోతేనే స్పందిస్తారా..? మనూర్–జహీరాబాద్ రహదారి గుంతలమయం!
● కాసినాథ్ మందిర్ మూలమలుపు వద్ద ప్రమాదాలకు ఆహ్వానం
● వర్షాలకు గుంతల్లో నిలిచిన నీరు.. నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం
● వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు, స్థానికుల విజ్ఞప్తి
నారాయణఖేడ్, జూలై 28 | తెలంగాణ స్రవంతి ప్రతినిధి(రాములు)
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్–జహీరాబాద్ ప్రధాన రహదారిపై కాసినాథ్ మందిర్‌కు వెళ్లే మూలమలుపు వద్ద రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. భారీ గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి వర్షానికి రహదారిపై ఏర్పడిన గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో వాటి లోతు గుర్తించడం కష్టంగా మారింది. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కాసినాథ్ మందిర్ మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించకపోవడం వల్ల ప్రమాద భయం వెంటాడుతోంది.
ఈ రహదారిపై ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు ప్రయాణిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత జాతీయ రహదారి అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
● ప్రమాదం జరిగిన తర్వాతే స్పందిస్తారా?
ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు మరమ్మతు పనులు చేపట్టకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం వాటిల్లిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యత కాదా? అని నిలదీస్తున్నారు.
● తక్షణమే గుంతలను పూడ్చాలని డిమాండ్
"ప్రాణాలు పోయిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదాలు జరగకముందే రహదారికి మరమ్మతులు చేపట్టాలి" అని ప్రయాణికులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు. వెంటనే గుంతలను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత సంబంధిత శాఖలపై ఉందని, ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
TS Media Telugu
"జనంనుంచి జనంలోకి"
www.telanganasravanti.in

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి