ఆదివాసి సంస్కృతి మన అస్తిత్వం… గిరిజన జీవన విధానం తరతరాలకు మార్గదర్శకం
👉 గిరిజన సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సీతక్క పిలుపు
👉 ఇలవేల్పుల చరిత్ర గ్రంథం ఆవిష్కరణ
👉 గిరిజన అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబాటు
చండ్రుగొండ, ఏప్రిల్ 10
తెలంగాణ స్రవంతి ప్రతినిధి బొగ్గుల శివ నాగిరెడ్డి
ఆదివాసి గిరిజన తెగల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు మన అస్తిత్వానికి ప్రతీకలని, వాటిని రాబోయే తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు.
శుక్రవారం ఐటిడిఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో నిర్వహించిన ఆదివాసి సాంస్కృతిక ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోయ ఇలవేల్పుల చరిత్ర గ్రంథాన్ని ఆవిష్కరించారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం ఆమెకు ఘన స్వాగతం పలికారు. చిన్నారుల సాంప్రదాయ నృత్యాలు, గిరిజన కళారూపాలు ఆకట్టుకున్నాయి.
మంత్రి మాట్లాడుతూ ఆదివాసులే దేశానికి మూలవాసులని, వారి సంస్కృతి, ఆచారాలు, కట్టుబాట్లు సమాజానికి ఆదర్శమని అన్నారు. గిరిజన తెగల ఐకమత్యానికి రేల పాటలు, డోలు నాదం ప్రతీకలని పేర్కొన్నారు. పూర్వీకుల సంప్రదాయాలను మరవకుండా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఇలవేల్పుల చరిత్రను లిఖిత రూపంలో తీసుకురావడం గర్వకారణమని, దీనికి కృషి చేసిన ఐటిడిఏ పీవో బి. రాహుల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గిరిజన గ్రామాల్లో పనిచేసే అధికారులు అంకితభావంతో పనిచేస్తే ప్రజలు వారిని దేవుళ్లుగా భావిస్తారని అన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకమైనవని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐటిడిఏ ద్వారా గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయడం, కోయ భాష, సంప్రదాయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమన్నారు.
ఐటిడిఏ పీవో బి. రాహుల్ మాట్లాడుతూ గిరిజన విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థుల కోసం వర్క్ బుక్స్, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గిరిజన రైతుల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు “భద్రగిరి మార్క్” ద్వారా ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పిన్నపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎస్పీ రోహిత్ రాజ్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, వివిధ శాఖల అధికారులు, గిరిజన పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
👉 మరిన్ని వివరాల కోసం:
🔗 https://telanganasravanti.in
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి