“దళితులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి: ఎమ్మార్పీఎస్ డిమాండ్”

 

తెలంగాణ స్రవంతి ప్రతినిధి, కామారెడ్డి:

దళితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రూసేగం భూమయ్య మాదిగ మాట్లాడుతూ దళిత సంక్షేమానికి సంబంధించిన పలు కీలక హామీలు ఇప్పటికీ అమలులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి కేటాయించాలని కోరారు.

ఇక GO 58 & 59 ప్రకారం అసైన్డ్ భూములను పట్టా చేసి వాటిని కొనుగోలు, అమ్మకాలకు హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని కూడా పేర్కొన్నారు.

అలాగే ఎస్సీ కార్పొరేషన్ శాఖకు రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. గత ప్రభుత్వ కాలంలో వైకుంఠధామాలు, కబరస్తాన్ల పేరుతో దళితుల వద్ద నుంచి తీసుకున్న అసైన్డ్ భూములను తిరిగి వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పారిశుద్ధ్య కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలని కోరారు. తోళ్ల పరిశ్రమల అభివృద్ధికి రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించి, లిడ్‌క్యాప్ భూములను పరిరక్షించేందుకు చైర్మన్‌ను నియమించి తోళ్ల పరిశ్రమలు ఏర్పాటు చేసి మాదిగ యువతకు ఉపాధి కల్పించాలని తెలిపారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పై హామీలన్నీ అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు శంకర్ మాదిగ, నాయకులు సర్వగల రవీందర్ మాదిగ, మైపాల్ మాదిగ, మారుతి మాదిగ, లక్ష్మణ్ మాదిగ, బాలరాజు, విజయ్ మాదిగ, సాయిలు మాదిగ, రాములు మాదిగ, విట్టల్ మాదిగ, అంబయ్య మాదిగ, రామవ్వ, కిట్టవ్వ, బాలవ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా

జనం నుంచి జనంలోకి ✍️

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం