జమలాపురంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం: వేలాదిగా భక్తుల హాజరు
జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ
వేదమంత్రాల మధ్య స్వామివారి పాణిగ్రహణం – వేలాదిగా తరలివచ్చిన భక్తులు
ఓం నమో వెంకటేశాయ… కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జమలాపురంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వకుళ మాత కళ్యాణ మండపంలో పచ్చని తోరణాల మధ్య వేదమంత్రోచ్ఛారణలతో స్వామివారు, అమ్మవారు పాణిగ్రహణం గావించారు.
వేలాదిమంది భక్తులు గోవింద నామ స్మరణలతో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఈ వేడుక భక్తులకు నైనానందకరంగా నిలిచింది.
శాస్త్రోక్తంగా నిర్వహించిన కళ్యాణ కరతువు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవాలయ అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఉప్పల వెంకట సీతారామాంజనేయ శాస్త్రి, హైమావతి దంపతులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, వరపూజ, పాదప్రక్షాళన, మధుపర్కాలు, యోక్త్ర పూజ, మాంగల్య పూజలను నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పోసే ఘట్టం భక్తులను ఆకట్టుకుంది. వధువులైన శ్రీ అలివేలు మంగ, పద్మావతి అమ్మవారికి తలంబ్రాలు సమర్పించిన వేళ భక్తులు భక్తి పరవశులయ్యారు.
దాతల సహకారం – సంప్రదాయ పట్టు వస్త్రాల సమర్పణ
గ్రామపంచాయతీ తరపున ఆనవాయితీగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సర్పంచ్ తుళ్లూరు నిర్మల కుమారి, పంచాయతీ కార్యదర్శి గరికపాటి కుమార్ సమర్పించారు.
దాతలు తుళ్లూరు కోటేశ్వరరావు, నిర్మల దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు.
అన్నదానం – భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
జమలాపురం, ఎర్రుపాలెం, మధిర, తిరువూరు, మైలవరం ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దేవస్థానం తరపున భక్తులకు ఉచితంగా మంచినీరు, వితరణలు అందించడంతో పాటు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
గరుడ వాహనంపై గ్రామ సేవ – ఘనంగా తెప్పోత్సవం
సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారు గరుడ వాహనంపై గ్రామ సేవగా బయలుదేరి భక్తజన సందోహం మధ్య గ్రామ చెరువులో ఘనంగా తెప్పోత్సవం (ప్లవంగోత్సవం) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వేలాదిగా వచ్చిన భక్తులు తిలకించి ఆనందో పరవశులయ్యారు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న అధికారులు, సేవా సంస్థలు
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కొత్తూరు జగన్ మోహన్ రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదశర్మ, వకుళ మాత కళ్యాణ మండపం నిర్మాణ దాత తుళ్లూరు కోటేశ్వరరావు, నిర్మల దంపతులు, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, గరుడాలయ నిర్మాణ దాత మూల్పూరి శ్రీనివాసరావు, అర్చకులు, దేవస్థాన సిబ్బంది, గ్రామ పెద్దలు, నాయకులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
👉 మరిన్ని వివరాలకు:
🌐 https://telanganasravanti.in�
✍️ తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి