రూపాయి రూపాయి కూడబెట్టిన పేదల కన్నీళ్లు – జమలాపురంలో 51 మంది రోడ్డెక్కిన వేదన
తెలంగాణ స్రవంతి ప్రతినిధి, మధిర | మార్చి 20:
జమలాపురం గ్రామంలో జరిగిన ఘటన స్థానికుల గుండెల్ని కదిలిస్తోంది. కూలి చేసి, చెమటోడ్చి, రూపాయి రూపాయి కూడబెట్టుకున్న పేదలు… నమ్మకం పెట్టుకొని ఇచ్చిన డబ్బు ఒక్కసారిగా మాయమవ్వడంతో కన్నీటి పర్యంతమయ్యారు.
ఎర్రుపాలెం మండలం పరిధిలోని ఈ గ్రామంలో కొర్లకంటి రామచంద్రరావు అనే వ్యక్తి స్థానిక పేదలు, రైతులు, కూలీలను నమ్మించి లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. “వడ్డీ ఇస్తాను… అవసరం ఉంది…” అంటూ నమ్మకం కలిగించి సుమారు 51 మంది నుండి లక్షల నుంచి ఐదు లక్షల వరకు డబ్బులు తీసుకున్నాడని బాధితులు వాపోతున్నారు.
చెమటోడ్చి సంపాదించిన డబ్బు… కొందరు అమ్మాయి పెళ్లి కోసం, మరికొందరు పిల్లల చదువు కోసం, ఇంకొందరు వైద్య అవసరాల కోసం దాచుకున్న డబ్బు… నమ్మకంతో ఇచ్చారు. కానీ అదే నమ్మకం ఇప్పుడు వారి జీవితాల్లో పెద్ద గాయంగా మారింది.
బాధితుల ఆరోపణల ప్రకారం, ముందే ప్రణాళిక వేసుకొని తన ఆస్తులను అమ్ముకొని డబ్బును మళ్లించుకున్న అనంతరం, కనిపించకుండా పోయిన రామచంద్రరావు కోర్టును ఆశ్రయించి తాను దివాలా తీసుకున్నానని ప్రకటించుకోవడం మరింత ఆవేదన కలిగిస్తోంది.
ఖమ్మం జిల్లా కోర్టు అతన్ని ఆర్థికంగా నిస్సహాయుడిగా గుర్తించిన విషయం తెలుసుకున్న బాధితులు శుక్రవారం ఒక్కసారిగా జమలాపురం గ్రామానికి చేరుకొని రోడ్డుపై బైఠాయించి విలపించారు. “మా డబ్బు తిరిగి ఇవ్వాలి… మా జీవితాలను ఎవరు కాపాడుతారు?” అంటూ వారి ఆర్తనాదం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినా… బాధితుల హృదయాల్లోని నొప్పి మాత్రం తగ్గలేదు.
ఈ ఘటనతో గ్రామంలో ఒకే మాట వినిపిస్తోంది — “నమ్మకం పెట్టుకున్న పేదలే మోసపోతున్నారు”. బాధితులకు న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనం నుంచి జనంలోకి ✍️

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి