మధిర అభివృద్ధిలో జర్నలిస్టులకు చోటెక్కడ?



మధిర అభివృద్ధిలో జర్నలిస్టులకు చోటెక్కడ..? రాజకీయ పార్టీల వైఖరిపై తీవ్ర విమర్శలు

ఇరవై ఏళ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులకు గుర్తింపు లేదు – కులాల లెక్కలకే పరిమితమైన టికెట్ల పంపకం – ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి

మధిర పట్టణ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అనివార్యమైనదే. కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు—ఈ అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ఏళ్ల తరబడి జర్నలిస్టులే భుజాన వేసుకున్నారు. అయినా నేడు అదే జర్నలిస్టులకు రాజకీయ గుర్తింపు దక్కకపోవడం మధిరలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

“ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే మీడియా అవసరం… కానీ అదే మీడియాకు రాజకీయాల్లో చోటు లేకపోవడం ఎంతవరకు న్యాయం?” అనే ప్రశ్న ఇప్పుడు పట్టణమంతా వినిపిస్తోంది. ఇరవై సంవత్సరాలుగా మధిరలో పనిచేస్తూ, సమాజ నాడిని తెలుసుకున్న సీనియర్ జర్నలిస్టులు ఉన్నప్పటికీ, వారిని రాజకీయ పార్టీలు పక్కన పెట్టడం సోషనీయమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జర్నలిస్టుల తరఫున ఎవరైనా ముందుకు వస్తే, కులాల పేరుతో వారిని నెట్టివేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. “సమాజంపై అవగాహన ఉన్నవాళ్లను కాదు, కేవలం సంఖ్యల లెక్కలనే చూస్తే పాలన ఎటు పోతుంది?” అని పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల కృషి కీలకమన్న విషయం రాజకీయ పార్టీలకు తెలియదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. “ప్రజల కోసం పని చేసినవారికి ప్రజల పాలనలో చోటు ఉండాలి” అన్న మాట కేవలం నినాదంగా మిగిలిపోతోందా అన్న ఆవేదన వినిపిస్తోంది.

మధిర అభివృద్ధిలో జర్నలిస్టులను భాగస్వాములు చేయకపోవడం ప్రజాస్వామ్యానికి కూడా నష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కులాల గణనలకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజ సేవలో ముందున్న జర్నలిస్టులకు న్యాయం చేయాలన్న డిమాండ్ పట్టణంలో బలంగా వినిపిస్తోంది.

“మీడియాను వాడుకుంటారా… లేక గౌరవిస్తారా?” అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం ఇప్పుడు రాజకీయ పార్టీల ముందుంది.

 -తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా. 

జనంనుచి జనంలోకి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం