ప్రజా పాలన లక్ష్యాలు గ్రామ స్థాయికి… సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు
👉 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా సమావేశం
👉 రైతు రుణమాఫీ నుంచి ఉచిత కరెంటు వరకు పథకాల వివరణ
👉 ప్రజలకు పూర్తిస్థాయి సమాచారం అందించాలని అధికారుల దిశానిర్దేశం
మద్నూర్, ఏప్రిల్ 16
తెలంగాణ స్రవంతి ప్రతినిధి
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా ప్రజా పాలన లక్ష్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీడీవో జగదీష్ అన్నారు. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన “99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సమావేశం ఎంపీడీవో జగదీష్ అధ్యక్షతన, మండల ప్రత్యేక అధికారి రమ్య ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విధానం, లబ్ధిదారుల అర్హతలు, అందించే ప్రయోజనాలపై విపులంగా వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతి గ్రామంలో అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతుబంధు, వృద్ధాప్య పెన్షన్లు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులకు సూచించారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేలా గ్రామ స్థాయిలో సమన్వయం పెంచాలని, ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
అధికారులు కూడా తమ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై వివరాలు వెల్లడిస్తూ, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో తహశీల్దార్ రంజిత్ కుమార్, మండల ఎంఈఓ శ్రీనివాస్, ట్రాన్స్కో, మండల వ్యవసాయ అధికారి, ఐసిడిఎస్ సిడిపిఓ కళావతి, డోంగ్లి మండల కేంద్ర సర్పంచ్ రేఖ శివాజీతో పాటు వివిధ శాఖల అధికారులు, మండల సర్పంచులు పాల్గొన్నారు.
👉 మరిన్ని వివరాల కోసం:
🔗 https://telanganasravanti.in
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి