ఈత చెట్ల తొలగింపుపై కలెక్టర్‌కు ఫిర్యాదు

 



ఖమ్మం జిల్లాలో గీత కార్మికుల జీవనాధారమైన 50 ఈత చెట్లు పీకివేత

ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం | :-

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని దమ్మాయిగూడెం గ్రామంలో గీత కార్మికుల జీవనాధారమైన ఈత చెట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల గౌడ సంఘం అధ్యక్షుడు బోడపట్ల సతీష్ బుధవారం ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌కు ఫిర్యాదు చేశారు.

సుమారు ఎనిమిదేళ్ల క్రితం దమ్మాయిగూడెం గ్రామ గౌడ సంఘం సభ్యులు తమ జీవనోపాధి కోసం గ్రామ చెరువు కట్టపై వందల సంఖ్యలో ఈత మొక్కలను నాటినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే గ్రామ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాం రాజశేఖర్ సూచనల మేరకు పంచాయతీ కార్యదర్శి రమేష్ జెసిబి సహాయంతో సుమారు 50 ఈత చెట్లను కక్షపూరితంగా తొలగించారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో గీత కార్మికుల ఉపాధి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో, ఇలా నాటిన చెట్లను తొలగించడం గీత కార్మికులను ఉపాధి లేకుండా చేయడమే కాకుండా వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తక్షణమే ఈత చెట్లను తొలగించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, తొలగించిన చెట్ల స్థానంలో గ్రామపంచాయతీ నిధులతో కొత్త ఈత మొక్కలను నాటించాలని కలెక్టర్‌ను వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శరత్, తోడేటి దుర్గాప్రసాద్ గౌడ్, కుక్కల నాగేశ్వరరావు గౌడ్, తిరుమలాయపాలెం మండలం గౌడ సంఘం అధ్యక్షుడు బోడపట్ల సతీష్, మల్లం సతీష్ గౌడ్, గౌని ఉదయ్ గౌడ్, బోడపట్ల నాగేశ్వరరావు గౌడ్, బోడబట్ల బద్రి గౌడ్, ఖమ్మం జిల్లా వైస్‌అధ్యక్షురాలు వట్టికూటి ఉమాదేవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా

జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం